: ఏపీలో కోటిన్నర మందికి 'చంద్రన్న కానుక'... తెలంగాణాలో కోటి కుటుంబాలకు అందని రేషన్!
ఈ సంక్రాంతి పండగ తెలుగు ప్రజల్లో కొందరికి ఆనందాన్ని, మరికొందరికి బాధనూ కలిగిస్తోంది. రాష్ట్రం విడిపోయిన తరువాత వచ్చిన తొలి సంక్రాంతి కావడంతో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజలకు ఘనమైన హామీలనే ప్రకటించాయి. అయితే వాటి అమలులో తెలంగాణ ప్రభుత్వం మాత్రం వెనుకబడింది. ఈ సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్ లో కోటి 30 లక్షల మందికి 'చంద్రన్న కానుక'లు అందజేశామని రాష్ట్ర ఐటీ, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి నేడు తెలిపారు. సంక్రాంతి పండగను పురస్కరించుకుని రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డుదారులకు ఆరు రకాల సరుకులను 'చంద్రన్న కానుక' పేరిట ఉచితంగా అందిస్తామని టీడీపీ ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ మేరకు బాబు సర్కారు మాట నిలబెట్టుకుంది.
ఇక తెలంగాణ విషయానికి వస్తే, కోటికిపైగా పేద కుటుంబాలు పండగ పూట పస్తులు ఉండాల్సిన పరిస్థితి. "తెలంగాణలో పండగ రోజు పప్పన్నం కాదు, పాయసం తాగుదాం. వారం రోజుల ముందే పేదలకు అవసరమైన పండుగ సామాను అందజేస్తాం" అని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని అమలు చేయడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. ఆహార భద్రతాకార్డుల తయారీలో సమస్యలు, సరుకుల సరఫరాపై స్పష్టత కొరవడటం కారణంగా సరుకుల పంపిణీ నిలిచిందని అధికారులు చేతులెత్తేశారు.
గతంలో ఉన్న రేషన్ కార్డుదారుల్లో కేవలం 20 నుంచి 30 శాతం మందికి మాత్రమే ఆహార భద్రతాకార్డుల సరఫరా జరిగిందని తెలుస్తోంది. వారికి కూడా అరకొరగానే సరుకులు అందాయి. కిలో చక్కర ఇవ్వాల్సిన చోట సరుకు రాలేదని అరకిలోతో సరిపెట్టారు. ఇక నూనె మాటే లేదని తెలుస్తోంది. చౌకధరల దుకాణం ద్వారా సరఫరా అవుతూ వచ్చిన పప్పు, గోధుమలు, ఉప్పు, చింతపండు లాంటి సరుకులు ఈ నెల అసలు దుకాణాలకే చేరలేదు. ప్రభుత్వ తీరుపై పేదలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.