: దయాసాగర్ ను విడుదల చేయండి: పీఎస్ ముందు యూదుబాబా అనుచరుల ధర్నా

కొత్తవలస కేంద్రంగా ఆధ్యాత్మికత పేరిట మహిళలను వంచించిన యూదుబాబా దయాసాగర్ ను విడుదల చేయాలని అతడి అనుచరులు ఆందోళనకు దిగారు. కోట్ల రూపాయల విలువ చేసే విలాస భవంతిలో ఏడేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న తంతు, ఓ మహిళ ఫిర్యాదుతో గత రాత్రి రట్టైంది. మహిళ ఫిర్యాదుతో భవంతిలోకి వెళ్లిన కొత్తవలస పోలీసులు భవంతిలోని అత్యాధునిక సౌకర్యాలను చూసి నోరెళ్లబెట్టారట. సోదాల్లో భాగంగా పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు దయాసాగర్ ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. విషయం తెలుసుకున్న అతడి అనుచరులు పెద్ద సంఖ్యలో పీఎస్ కు చేరుకుని ఆందోళనకు దిగారు. దయాసాగర్ ను తక్షణమే విడుదల చేయాలంటూ వారు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. తనతో సంభోగిస్తే, స్వర్గం ప్రాప్తిస్తుందంటూ తన వద్దకు వచ్చిన పలువురు మహిళలను లోబరచుకున్న దయాసాగర్ వారితో విశృంఖల రాసలీలలు సాగించారు. దయాసాగర్ గుట్టు తెలియని ఓ మహిళ అక్కడికెళ్లి అసలు విషయం తెలుసుకుని కంగుతింది. ఆ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు మహిళ ఫిర్యాదు నేపథ్యంలో దయాసాగర్ అకృత్యాలపై విజయనగరం, విశాఖ జిల్లాల్లో పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

More Telugu News