: దొంగల్ని పరుగులు పెట్టించిన బీటెక్ యువతి
మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఓ ధీర యువతి దొంగలను పరుగులు పెట్టించి, హోం మంత్రి, పోలీసుల ప్రశంసలు అందుకుంటోంది. భోపాల్ లోని అన్సాల్ ప్రధాన్ ఎన్ క్లేవ్ లో చరణ్ ప్రీత్ కౌర్ అనే యువతి కుటుంబం నివాసం ఉంటోంది. నిన్న తెల్లవారుజామున చరణ్ ప్రీత్ కౌర్ పరీక్షల కోసం రెండవ అంతస్తులో చదువుకుంటోంది. మిగిలిన కుటుంబ సభ్యులంతా నిద్రపోతున్నారు. ఇంతలో ముసుగులు ధరించిన ఐదుగురు దొంగలు గుట్టుచప్పుడు కాకుండా చరణ్ ప్రీత్ ఇంట్లోకి దూరారు.
వారిని పసిగట్టిన చరణ్ ప్రీత్ బిగుసుకుపోకుండా, అప్రమత్తమైంది. తెలివిగా నెమ్మదిగా రెండో అంతస్తులో ఉన్న పొడవాటి కత్తిని తీసుకుని జాగ్రత్తగా కిందికి దిగింది. చప్పుడు కాకుండా కింది అంతస్తులో పడుకున్న తండ్రి హర్వీందర్ సింగ్ ని లేపింది. కుమార్తె సైగలు అర్థం చేసుకున్న హర్వీందర్ సింగ్ మరోపెద్ద కత్తిని తీసుకుని కుమార్తె వద్దకు వచ్చాడు. తండ్రి రావడంతో కొండంత బలాన్ని కూడదీసుకున్న చరణ్ ప్రీత్ దొంగల మీదికి లంఘించింది.
చరణ్ ప్రీత్ ఒడుపుగా కత్తిని తిప్పుతూ దొంగలను ఎదుర్కొంది. ఆమె ఆగ్రహాన్ని చవిచూసిన దొంగలు పరుగు లంకించుకున్నారు. దీంతో, చుట్టుపక్కల వారు లేచారు. అప్పటికే దొంగలు పరారవ్వడంతో విషయం తెలుసుకున్న ప్రతివారు చరణ్ ప్రీత్ ను అభినందించారు. స్థానిక పోలీసులే కాకుండా, సాక్షాత్తూ హోం మంత్రి బాబూలాల్ గౌర్ స్వయంగా వెళ్లి అభినందించారు.