: క్యాచ్ వదిలి కెమెరాను తప్పుబడుతున్నాడు!
సిడ్నీ టెస్టు మూడో రోజు ఆటలో లంచ్ కు ముందు ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. టీమిండియా యువ బ్యాట్స్ మన్ కేఎల్ రాహుల్ 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద, వాట్సన్ విసిరిన బంతిని గాల్లోకి లేపాడు. స్లిప్స్ లో ఫీల్డింగ్ చేస్తున్న ఆసీస్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ క్యాచ్ పట్టేందుకు వెళ్లి బంతిని నేలపాలు చేశాడు. అయితే, మ్యాచ్ ను చిత్రీకరిస్తున్న స్పైడర్ కెమెరా కారణంగానే తాను క్యాచ్ పట్టడంలో విఫలమయ్యానని ఆరోపించాడు. కెమెరా తాలూకు వైర్లకు బంతి తగలడంతో దిశను అంచనా వేయలేకపోయానని వివరించాడు. వీక్షకులు, కామెంటేటర్లు సూర్య కాంతి కళ్లలో పడడంతో క్యాచ్ వదిలేశాడని భావించారు. కాగా, లైఫ్ పొందిన కర్ణాటక కుర్రాడు రాహుల్ సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే.
సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన 'స్పైడర్ క్యామ్' మైదానాన్ని పై నుంచి చిత్రీకరిస్తుంది. దీని ద్వారా అదనంగా మరో కోణంలోనూ మ్యాచ్ ను వీక్షించవచ్చు. ఇవి చిత్రీకరించే చిత్రాల నాణ్యత కూడా బాగుంటుంది. తద్వారా టీవీలో వీక్షించేటప్పుడు అభిమానులు కొత్త అనుభూతికి లోనవుతారు.