: జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ కు గండి తప్పదా?... గ్రేటర్ ఎన్నికలపై అమిత్ షా గురి!
కొత్త రాష్ట్రం తెలంగాణలో సత్తా చాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ కు గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం సత్ఫలితాలు సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. టీఆర్ఎస్ ను కట్టడి చేసేందుకు ఇప్పటికే టీడీపీ అధిష్ఠానంతో కలిసి బీజేపీ స్థానిక నేతలు కసరత్తు ప్రారంభించారు. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా గ్రేటర్ ఎన్నికలపై గురిపెట్టారు. కేంద్రంలో పార్టీకి అధికారంతో పాటు వరుసగా వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో పార్టీకి అనూహ్య ఫలితాలను సాధించిపెడుతున్న అమిత్ షా గ్రేటర్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఆయన తెలుగు రాష్ట్రాల పర్యటనకు వచ్చినట్లు సమాచారం.
తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతంపైనే ఆయన దృష్టిపెట్టనున్నారని పార్టీ నేతలు చెబుతున్నా, నేడు జరిగే పార్టీ తెలంగాణ పదాధికారుల భేటీలో అమిత్ షా, గ్రేటర్ ఎన్నికలపైనే ప్రధానంగా మాట్లాడనున్నట్లు సమాచారం. గ్రేటర్ లో టీఆర్ఎస్ బలహీనంగా ఉండటం, బీజేపీ, టీడీపీలకు పలు ప్రాంతాల్లో గట్టి పట్టున్న నేపథ్యంలో దానిని మరింత బలోపేతం చేస్తే, ఎన్నికల్లో విజయం సాధించడం అంత కష్టమేమీ కాదని అమిత్ షా అంచనాలు వేస్తున్నారట. అదే సమయంలో ఏ తరహా వ్యూహాలతో అనుకున్న ఫలితాలను రాబట్టగలమనే అంశంపై ఆయన నేటి పదాధికారుల సమావేశంలో స్థానిక పార్టీ నేతలతో కూలంకషంగా చర్చిస్తారని తెలుస్తోంది.