: ఏపీలో దుష్ట పాలన: వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని
ఆంధ్రప్రదేశ్ లో దుష్టపాలన సాగుతోందని వైసీపీ నేత, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఆరోపించారు. రాష్ట్రంలో టీడీపీ పాలనకు నిరసనగా గుడివాడ ఆర్డీఓ కార్యాలయం ముందు నేటి ఉదయం జరిగిన ధర్నాలో పాల్గొన్న ఆయన చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వృద్ధులు, వితంతువులు, రైతులు, నిరుద్యోగుల కన్నీటితో చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడైనా కుప్పకూలడం ఖాయమని ఆయన అన్నారు.
లోటు బడ్జెట్ అని చెప్పి కూడా అమలుకాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని కొడాలి నాని దుయ్యబట్టారు. చంద్రబాబు దరిద్రపు పాలన ఎప్పుడు వదులుతుందా? అని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన పయ్యావుల కేశవ్ నామినేటెడ్ పదవి దక్కించుకునేందుకే చంద్రబాబును స్తుతిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.