: పాక్ ఓడకు ఉగ్ర లింకులు: ఆధారాలున్నాయన్న రక్షణ మంత్రి పారికర్
గుజరాత్ తీరంలో పేలిపోయిన పాకిస్థానీ ఓడకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ చెప్పారు. ఈ విషయంలో తమపై నిందలేస్తున్నారన్న పాక్ వాదనలో పసలేదని ఆయన అన్నారు. ఉగ్ర లింకులకు సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఆయన ప్రకటించారు. నిఘా వర్గాల సమాచారం ఆధారంగా కోస్ట్ గార్డ్ సకాలంలో స్పందించి తమ విద్యుక్త ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించిందని పేర్కొన్నారు.
కోస్ట్ గార్డ్ దళాలు తమ కదలికలను గుర్తించాయని భావించిన నేపథ్యంలోనే ఉగ్రవాదులు తమను తాము పేల్చేసుకున్నారని కూడా పారికర్ చెప్పారు. భారత్ తీరానికి చేరుకుంటున్న రెండు ఓడల్లోని వ్యక్తులు పరస్సరం వాకీటాకీల ద్వారా సంభాషించుకున్నారని, అంతేకాక పాక్ సైన్యం, ఆ దేశ తీర భద్రత దళాలతోనూ వారు సంభాషించారన్నారు. పాక్ లోని అధికారులతో పాటు థాయ్ లాండ్ లోని ఓ వ్యక్తితోనూ ఓడలోని ఉగ్రవాదులు మాట్లాడినట్లు తమ వద్ద ఆధారాలున్నాయని పారికర్ వెల్లడించారు.