: ఎర్రచందనం అక్రమాల్లో ఆర్టీసీ అధికారులకూ భాగం... మరో 21 మంది అరెస్ట్
చెన్నై నుంచి ఆర్టీసీ బస్సులలో ఎర్రచందనం కూలీలను కడప జిల్లాకు తరలిస్తున్న ఉదంతంలో డ్రైవర్లతో పాటు ఉన్నతాధికారులకూ భాగం ఉందని తెలుస్తోంది. పదే పదే ఒకే రూట్లో డ్యూటీ వేసేందుకు వీరు డ్రైవర్ల నుంచి ముడుపులు తీసుకున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. తాజాగా, కర్నూలు జిల్లాకు చెందిన ఆత్మకూరు, ఆళ్లగడ్డ, నంద్యాల డిపోల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ కు సహకరించారన్న ఆరోపణలపై మరో 21 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెలరోజులుగా దొరికిన ఎర్రచందనం కూలీలను విచారించి, పలువురు డ్రైవర్ల పేర్లను రాజంపేట పోలీసులు రాబట్టినట్లు తెలిసింది. వారి సమాచారం మేరకు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇప్పుడు అధికారులపై దృష్టి సారించారు. గతనెలలో నంద్యాల ఆర్టీసీ డిపోకు చెందిన 11 మంది డ్రైవర్లను పోలీసులు అరెస్టు చేయగా, వారు సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. డ్రైవర్లపై చర్యలు తీసుకున్న ఆర్టీసీ యాజమాన్యం అధికారుల ప్రమేయంపై ఎలా స్పందిస్తుందో!