: ప్రపంచం మనవైపే చూస్తోంది: మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ముంబయిలో 102వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచం ఇప్పుడు భారత్ వైపే చూస్తోందన్నారు. మన శాస్త్రవేత్తలు అనేక అంశాల్లో ప్రపంచంలోనే ముందువరుసలో ఉన్నారని తెలిపారు. మంగళయాన్ ను తొలి ప్రయత్నంలోనే విజయవంతంగా ప్రయోగించామని ఈ సందర్భంగా మోదీ ఉదహరించారు. మనం సాధించిన విజయాలు గర్వకారణమని, అయితే, సవాళ్లను గుడ్డిగా ఎదుర్కొనడం సరికాదని పేర్కొన్నారు.
ప్రపంచాన్ని ఏకతాటిపై నిలిపే శక్తి శాస్త్ర, సాంకేతిక రంగానికి ఉందని అన్నారు. దేశాభివృద్ధి అంశం సాంకేతిక రంగ పురోగతిపై ఆధారపడి ఉందని అభిప్రాయపడ్డారు. దేశాభివృద్ధి, మానవ అభివృద్ధి శాస్త్ర, సాంకేతిక రంగంతో ముడిపడి ఉన్నాయని వివరించారు. ఉత్పత్తి రంగంలో భారత్ అగ్రగామిగా నిలవాలని ఆకాంక్షించారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహిస్తామని తెలిపారు. శాస్త్ర, సాంకేతిక రంగ ఫలాలు పేదవాడికి చేరాలని అన్నారు.
దేశాభివృద్ధిని మనస్ఫూర్తిగా కాంక్షించి నెహ్రూ ఈ సదస్సుకు శ్రీకారం చుట్టారని మోదీ కొనియాడారు. అంతకుముందు, ఈ సదస్సులో పాల్గొనడాన్ని గౌరవంగా భావిస్తున్నానని, సదస్సుకు ఆతిథ్యమిచ్చిన ముంబయి వర్శిటీకి కృతజ్ఞతలు తెలిపారు.