: పిల్లికి మందిరం కట్టాడు!
లక్నోకు చెందిన ఫ్రాంక్ హుజూర్ ఒక్క పుస్తకంతో ఎంతో పేరుపొందాడు. 36 ఏళ్ల హుజూర్ పాకిస్థాన్ మాజీ క్రికెటర్, రాజకీయవేత్త ఇమ్రాన్ ఖాన్ జీవిత చరిత్ర 'ఇమ్రాన్ వర్సెస్ ఇమ్రాన్-ద అన్ టోల్డ్ స్టోరీ'తో ఎంతో పాప్యులర్ అయ్యాడు. ఈ యూపీ రాష్ట్రీయుడికి పిల్లులంటే ఎంతో ప్రేమ. ప్రస్తుతం అతని వద్ద 28 పిల్లులున్నాయట. అతనికి పిల్లులంటే ఎంత ప్రేమంటే, తనకిష్టమైన బొకా అనే పిల్లి చనిపోతే, దానికోసం తన లక్నో నివాసంలో మందిరం కట్టాడు. అందులో తెల్లని పిల్లి విగ్రహం నిలబెట్టాడు. గత మంగళవారం ప్రార్థన చేసిన అనంతరం ఆ మందిరాన్ని ప్రజల సందర్శనార్థం తెరిచారు. పర్షియన్ జాతికి చెందిన బొకా సెప్టెంబర్ 27న మరణించింది.
దీనిపై హుజూర్ మాట్లాడుతూ, అన్ని పిల్లుల్లాగానే బొకా కూడా తనతో ఎంతో సన్నిహితంగా ఉండేదని తెలిపాడు. అది పిల్లి మాత్రమే కాదని, దాంతో తనకు దివ్యమైన అనుబంధం ఉందని పేర్కొన్నాడు. ప్రస్తుతం తన వద్ద ఉన్న పిల్లుల్లో 20 పిల్లులకు బొకానే తండ్రి అని వివరించాడు. మూడు ఆడపిల్లులతో జతకూడి ఈ సంతానం పొందిందని పేర్కొన్నాడు. కాగా, 2012లో మొదలైందట హుజూర్ పిల్లుల ప్రేమ. వీధుల్లో తిరిగే ఓ పిల్లి తన ముంబయి నివాసంలోకి వచ్చి, అక్కడే ఆవాసం ఏర్పరచుకుందట. దానికి మిల్లీ అని పేరుపెట్టి, తన పిల్లుల సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడు హుజూర్.