: విజయవాడ-గుంటూరు మధ్య మెట్రో రైలు... వయా నవ్యాంధ్ర రాజధాని తుళ్లూరు!
నవ్యాంధ్రప్రదేశ్ కొత్త రాజధాని తుళ్లూరు మీదుగా విజయవాడ-గుంటూరు మధ్య మెట్రో రైలు త్వరలో పరుగులు పెట్టనుంది. దాదాపు 100 కిలోమీటర్ల దూరమున్న ఈ మార్గాన్ని ఏర్పాటు చేసి తీరేందుకు ఏపీ ప్రభుత్వం దాదాపుగా నిర్ణయం తీసేసుకుంది. అనుకున్న వెంటనే మెట్రో రైలు నిపుణుడు శ్రీధరన్ ను రంగంలోకి దించింది. ప్రస్తుతం శ్రీధరన్ ఈ పనులకు సంబంధించిన సర్వేలో నిమగ్నమయ్యారు. త్వరలో సర్కారుకు ఆయన నివేదిక కూడా సమర్పించనున్నారు.
రెండు నగరాల పరిధిలో స్తంభాలు వేసి రైలు మార్గాన్ని నిర్మించాలని భావిస్తున్న సర్కారు, నగరాల వెలుపల భూమి మీదే రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలని తలపోస్తోంది. దీంతో నిర్మాణ ఖర్చును తగ్గించుకోవడంతో పాటు త్వరితగతిన నిర్మాణం పూర్తయ్యేందుకు అవకాశాలున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ఈ మార్గంలో పలు విద్యా సంస్థలు, సర్కారీ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలు ఉన్నందున ఈ ప్రాజెక్టు లాభాల పంట పండిస్తుందని కూడా ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.