: తప్పతాగి తన్నుకున్న జీడిమెట్ల పోలీసులు
నిత్యమూ డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో వేధించే ట్రాఫిక్ పోలీసులు పట్టపగలు పూటుగా మందుకొట్టి ఒకరితో ఒకరు ఘర్షణ పడటం విమర్శలకు తావిచ్చింది. పైగా వీరు యూనిఫాంలో ఉండటంతో చూసేవారు ఔరా అని ముక్కున వేలేసుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్ శివార్లలోని జీడిమెట్లలో జరిగింది. ఒక వ్యక్తి తన లారీలకు పూజ చేసి విందు ఏర్పాటు చేశాడు. దానికి జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు చెందిన ఎస్సై, ఏఎస్సైతో పాటు సుమారు 18 మంది పోలీసులు హాజరయ్యారు. విందు సందర్భంగా సదరు లారీల యజమాని ఏర్పాటు చేసిన మద్యాన్ని వీరు కాస్త గట్టిగానే సేవించారు.
అప్పుడిక వారిలోని మరో కోణం బయటపడింది. మద్యం మత్తులో ఒకరినొకరు తిట్టుకుంటూ పరస్పర దాడులకు దిగారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. యూనిఫాంలో ఉండి మద్యం సేవించడం సహించరానిదని ఆయన అన్నారు.