: ఇప్పటికీ నా బాధ అదే: సచిన్
రెండు దశాబ్దాలకు పైగా సాగిన తన కెరీర్లో 2007 ప్రపంచ కప్ వైఫల్యం అత్యంత దురదృష్టకరమైనదని, భారత జట్టు ఎటువంటి పోరాట పటిమనూ చూపకుండా వెనుదిరిగిన తీరు తనను ఇప్పటికీ బాధిస్తూనే ఉందని సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానించారు. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ కౌంట్ డౌన్ ప్రారంభమైన నేపథ్యంలో సచిన్ ఒక ప్రత్యేక వ్యాసం రాశారు. ఆ ఘోర వైఫల్యమే నాలుగేళ్ల అనంతరం 2011లో విజేతగా నిలిచేందుకు పునాది వేసిందని తెలిపారు.
ప్రపంచ కప్ ను గెల్చుకోవాలన్న కోరిక 2007లో తీరకపోవడంతో తాను మానసికంగా కుంగిపోయానని సచిన్ వివరించారు. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్ అన్ని విధాలుగా బలంగా ఉందని, మరోసారి విజేతగా నిలుస్తుందని జోస్యం చెప్పారు. 2003 వరల్డ్ కప్ తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని, ఇండియా టైటిల్ ను గెలవనప్పటికీ, తాను 11 మ్యాచ్ లలో 673 పరుగులు చేయడం ఆనందాన్ని కలిగించిందని వివరించారు.