: నేటి రాత్రి విశాఖ బీచ్ లో పోలీసుల ఆంక్షలు
విశాఖపట్నంలో జరిగే నూతన సంవత్సర వేడుకలకు ఓ ప్రత్యేకత ఉంది. నగరంలోని యువత మొత్తం నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు ఆర్కే బీచ్ కు క్యూ కడుతుంది. దీంతో, బీచ్ ఒడ్డున ఇసుకేస్తే రాలనంతగా జనసందోహం గుమిగూడుతుంది. ఇంకేముంది, సంబరాలే సంబరాలు! కొత్త సంవత్సర వేడుకలు అమితానందోత్సాహల నడుమ అద్భుతంగా జరుగుతాయి.
అయితే, ఈ వేడుకలో ఎటువంటి అపశ్రుతి దొర్లకుండా ఉండేందుకు అధికారులు పలు ఆంక్షలు విధించారు. ఆర్కే బీచ్ కు దారితీసే రహదారులలో వాహనాల ప్రవేశాలను రాత్రి 8 గంటల నుంచి నిలిపేస్తున్నట్టు ప్రకటించారు. విశాఖ బీచ్ రోడ్డులో త్రిబుల్ రైడింగ్ ను నిషేధించినట్టు తెలిపారు. ఒకే బైక్ పై ముగ్గురు ప్రయాణిస్తున్నట్టు కనపడితే కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు.
బీచ్ రోడ్డులో బాణసంచా కాల్చడం నిషేధించినట్టు స్పష్టం చేశారు. నగరంలోని హోటళ్లలో వేడుకలు రాత్రి 1 గంట వరకే జరుపుకునేందుకు అనుమతినిచ్చినట్టు వెల్లడించారు. శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా పౌరులు నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని పోలీసులు సూచించారు. బైక్ రైడింగ్ తో ఫీట్లు చేస్తున్నట్టు తెలిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరించారు.