: బెంగళూరు నుంచి చెన్నైకి మరో 'గుండె' ప్రయాణించింది!

గత కొంతకాలంగా బెంగళూరు, చెన్నై నగరాల మధ్య 'గుండె'లు తరలించడం తెలిసిందే. ట్రాఫిక్ ను ఆపేసి, ఆ 'గుండె'ను తీసుకువస్తున్న వాహనానికి దారివ్వడం ద్వారా, మనిషికి ప్రాణం పోసిన వార్తలు చదువుతున్నాం. తాజాగా, మరో 'గుండె' బెంగళూరు నుంచి చెన్నైకి ప్రయాణించింది. అయితే, ఈ గుండె ఓ చిన్నారి కోసం తరలించారు. బెంగళూరు హెచ్ఏఎల్ విమానాశ్రయం నుంచి చెన్నైకి ఓ గుండెను తీసుకెళ్లిన వైద్యులు ఆ గుండెను రోగికి విజయవంతంగా అమర్చారు. బెంగళూరు మణిపాల్ ఆసుపత్రిలో సుమారు రెండేళ్ల 10 నెలల చిన్నారి బ్రెయిన్ డెడ్ పరిస్థితిలోకి వెళ్లాడు. అదే సమయంలో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో రెండేళ్ల 8 నెలల చిన్నారి గుండె మార్పిడి కోసం ఎదురుచూస్తోంది. బ్రెయిన్ డెడ్ చిన్నారి గుండెను దానం చేసేందుకు తల్లిదండ్రులు అంగీకరించడంతో బెంగళూరు పోలీసులు గ్రీన్ కారిడార్ ఏర్పాటుచేసి హుటాహుటిన మణిపాల్ ఆసుపత్రి నుంచి విమానాశ్రయానికి గుండెను తరలించారు. చెన్నైలో కూడా పోలీసులు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయడంతో చెన్నైలోని చిన్నారికి గుండెను విజయవంతంగా అమర్చారు.

More Telugu News