: దటీజ్ కలెక్టర్ చంద్రకళ... వీడియోను చూసిన 6 లక్షల మంది!
నాణ్యతలేని రోడ్లు, నాసిరకం పనులు చూసి కాంట్రాక్టర్లపై అపర కాళిలా లేచారు ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ కలెక్టర్ చంద్రకళ. 'జైలుకు పంపిస్తా జాగ్రత్త' అంటూ కాంట్రాక్టర్లకు ప్రజల ముందే గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆమె వార్నింగ్ ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఒక్క రోజులోనే ఈ వీడియోను 6 లక్షల మందికి పైగా వీక్షించారు.
కొత్త రోడ్ల నిర్మాణపనుల పర్యవేక్షణకు వెళ్లిన ఆమె అవి నాసిరకంగా ఉండటంతో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. "మీరు కొంచెమన్నా నైతికతను పాటించండి. అది మీలో ఎప్పుడో చచ్చిపోయినట్టుంది. కొంచం సిగ్గుపడండి" అంటూ అధికారులను చెడామడా వాయించారు. 'ఇది ప్రజాధనం. మీ సొంత సొమ్ము కాద'ని హెచ్చరించారు. ఆమె వార్నింగ్ ఫలితంగా అధికార సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యే సోదరుడు సహా ముగ్గురిపై కేసులు నమోదయ్యాయి. చంద్రకళ గతంలో 17 కాంట్రాక్టులను రద్దు చేసి వార్తల్లో నిలిచారు.