: అమేథీలో ఇకపై రాహుల్ కు కష్టకాలమే!

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి తన సొంత నియోజకవర్గం అమేథీలో ఇకపై గెలుపు అంత సులువు కాబోదు. ఎందుకంటే, ఆ నియోజకవర్గంపై కేంద్రం మంత్రులు స్మృతి ఇరానీ, మనోహర్ పారికర్ దృష్టి సారించారు. అమేథీపై పట్టు సాధించే దిశగా, బీజేపీ చేస్తున్న యత్నాల్లో భాగంగా వారిద్దరూ సదరు నియోజకవర్గంలోని రెండు గ్రామాలను మోడల్ గ్రామాలుగా ఎంపిక చేసుకోనున్నారు. రాజ్యసభ సభ్యులుగా ఉన్న వారిద్దరూ దేశంలోని ఏ ప్రాంతంలోని గ్రామాలనైనా మోడల్ గ్రామాలుగా ఎంపిక చేసుకునే వీలుంది. రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బీజేపీ అమేథీ ఇన్ చార్జి దుర్గేశ్ త్రిపాఠితో మనోహర్ పారికర్ భేటీ అయ్యారు. అమేథీ నియోజకవర్గంలోని అత్యంత వెనుకబడిన గ్రామాలను సూచించాలన్న పారికర్ విజ్ఞప్తికి స్పందించిన త్రిపాఠి... హరిహరపూర్, బరోలియా, హలియాపూర్, సెమ్రాటా గ్రామాలను సూచించారు. వీటిలో ఏదో ఒక గ్రామాన్ని పారికర్ తన మోడల్ విలేజ్ గా ఎంపిక చేసుకోనున్నారు. మిగిలిన వాటి నుంచి స్మృతి ఇరానీ మరో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ఎంపిక చేసుకుంటారట. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ పై పోటీకి దిగిన స్మృతి ఇరానీ గట్టి పోటీనే ఇచ్చారు. తాజాగా, పారికర్ కూడా అమేథీపై గురిపెట్టడంతో ఇకపై అక్కడ విజయం సాధించేందుకు రాహుల్ మరింతగా శ్రమించాల్సి రావచ్చు. గాంధీల కుటుంబానికి కంచుకోటగా నిలుస్తోన్న అమేథీ, రాయ్ బరేలీలపై బీజేపీ శీతకన్నేస్తోందన్న ఆరోపణలకు చెక్ పెట్టేందుకు బీజేపీ ఈ తరహా చర్యలకు శ్రీకారం చుట్టింది.

More Telugu News