: వెంకటరమణ మృతికి చంద్రబాబు, ఏపీ మంత్రుల సంతాపం
తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ మృతికి ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సంతాపం ప్రకటించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటరమణ నేటి ఉదయం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. వెంకటరమణ మరణ వార్త తెలియగానే చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తిరుపతిలో తనదైన శైలిలో వెంకటరమణ చేసిన సేవలను ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. వెంకటరమణ కుటుంబానికి చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
ఇదిలా ఉంటే, మొన్నటిదాకా కాంగ్రెస్ లో కొనసాగిన వెంకటరమణ ఇటీవలే టీడీపీలో చేరారు. అంతేకాక వైకాపాకు గెలుపు ఖాయమనుకున్న తిరుపతి నుంచి ఆయన టీడీపీ టికెట్ పై గెలిచి తన సత్తా చాటారు. ఏపీ మంత్రులు కేఈ కృష్ణమూర్తి, అయ్యన్నపాత్రుడు, దేవినేని ఉమా, అచ్చెన్నాయుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పరిటాల సునీత, మృణాళినిలతో పాటు ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, టీడీపీ సీనియర్ నేతలు గాలి ముద్దుకృష్ణమనాయుడు, కిమిడి కళా వెంకట్రావు తదితరులు సంతాపం ప్రకటించారు. చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ కూడా వెంకటరమణ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.