: కొత్త పదవులు వీరికే!... ఎల్లుండే ప్రమాణ స్వీకారం

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 16వ తేదీ ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం మంత్రివర్గంలో 12 మంది సభ్యులుండగా, నిబంధనల ప్రకారం మరో ఆరుగురికి స్థానం కల్పించే వీలుంది. ఖమ్మం జిల్లా నుంచి తుమ్మల నాగేశ్వరరావుకు చోటు ఖాయమని సీఎం సన్నిహిత వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం తెలుస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి జూపల్లి కృష్ణారావు, డాక్టర్ సి.లక్ష్మారెడ్డిలకూ బెర్తులు ఖరారయ్యాయి. మిగతా మూడింటి కోసం కనీసం ఆరుగురు ఎమ్మెల్యేలు పోటీలో ఉన్నారు. వరంగల్ జిల్లా నుంచి ఆజ్మీరా చందూలాల్, కొండా సురేఖ, దాస్యం వినయ్‌భాస్కర్‌ల్లో చందూలాల్‌కు ఎక్కువగా అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, కోవా లక్ష్మి పోటీపడుతుండగా ఇంద్రకరణ్‌కు ఛాన్సుందంటున్నారు. హైదరాబాద్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు కూడా బలంగా విన్పిస్తోంది. కాగా, ప్రభుత్వ చీఫ్ విప్‌గా కొప్పుల ఈశ్వర్‌ను, విప్‌లుగా గంపా గోవర్ధన్ (కామారెడ్డి), గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి (ఆలేరు), నల్లాల ఓదేలు (చెన్నూరు) లను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ శనివారం రాత్రి ఉత్తర్వులు కూడా జారీ చేశారు.

More Telugu News