: టోల్ అడిగితే బూటుతో కొట్టాడు... తృణమూల్ నేత దౌర్జన్య కాండ

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మరో వివాదంలో చిక్కుకుంది. ఆ పార్టీకి చెందిన నేత ఒకరు టోల్ గేట్ సిబ్బందిపై దౌర్జన్యానికి దిగారు. ముష్టిఘాతాలతో విరుచుకుపడటమే కాక కాలికున్న బూటు తీసి మరీ కొట్టాడట. ఇంతకూ ఆయనగారు అంత ఆగ్రహంగా ఊగిపోవడానికి కారణమేమిటో తెలుసా..? టోల్ రుసుము చెల్లించమని అడగడమే! వివరాల్లోకి వెళితే... పశ్చిమ బెంగాల్ మైనారిటీ డెవలప్ మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అబూ ఆయేశ్ మొండల్ ఆదివారం రాత్రి కోల్ కతా నుంచి బుర్ద్వాన్ బయలుదేరారు. హూగ్లీ జిల్లా దంకుని టోల్ ప్లాజా వద్ద ఆయన కారును నిలిపేసిన టోల్ గేట్ సిబ్బంది, టోల్ రుసుము చెల్లించాలని కోరారు. తాను ప్రభుత్వ ప్రతినిధినంటూ ఆయన చెప్పారు. ‘సరే, ఓ సారి ఐడెంటిటీ కార్డు చూపండి సార్’ అంటూ టోల్ గేట్ ఉద్యోగి ఒకరు ఆయనను అడిగారు. అంతే, ఒక్కసారిగా కారు దిగిన మొండల్ అతడిపై ముష్టిఘాతాలు కురిపించారట. ఆయనను నిలువరించేందుకు అక్కడికొచ్చిన మిగతా సిబ్బందిపైనా ఆయన చేయి చేసుకున్నారు. అయినా కోపం తగ్గని మొండల్ కిందకు వంగి తన కాలికున్న బూటు తీసి, తనను ఐడీ కార్డు అడిగిన ఉద్యోగిని కొట్టాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో తనను ప్రశ్నించిన విలేకరుల వద్ద... వాగ్వాదం జరిగిన మాట వాస్తవమేనని ఆయన ఒప్పుకున్నారు. అయితే, తానెవరినీ... దేనితోనూ కొట్టలేదని మొండల్ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే, ఆయనగారు గతంలోనూ టోల్ గేట్ సిబ్బందిపై దాడి చేశారట.

More Telugu News