: పాల్ రొసోలీ 'అనకొండ' సాహసాన్ని 4.1 మిలియన్ల మంది వీక్షించారట!
అమెరికన్ ప్రకృతి ప్రేమికుడు పాల్ రొసోలీ అనకొండ నోట్లోకి వెళ్లిరావడం ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. డిస్కవరీ చానల్లో ప్రసారమైందా సాహసఘట్టం. కొందరు దీన్ని అభినందించగా, మరికొందరు తీవ్రంగా వ్యతిరేకించారు. కాగా, ఈ సాహసం తాలూకు వీడియోను ఆన్ లైన్లో 4.1 మిలియన్ల మంది వీక్షించారట. కార్యక్రమంలో భాగంగా, అమెజాన్ అడవుల్లో ఓ అనకొండను రెచ్చగొట్టాడీ ధైర్యశాలి. అది ఆవేశంగా అతడిని చుట్టేసింది. శరీరానికి రక్షణగా కార్బన్ ఫైబర్ సూట్ ధరించడంతో కొంతమేర దాని పట్టు నుంచి రక్షణ కలిగింది.
అయితే, అనకొండ తన బలమైన దవడలతో అతడి తలను మింగేయడం ప్రారంభించింది. దీంతో, మిత్రులు రొసోలీని అనకొండ నోట్లోంచి బయటికి లాగారట. కాగా, దీనిపై పెటా తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. కార్యక్రమాన్ని ప్రసారం చేసిన డిస్కవరీ చానల్ మాత్రం పాముకు ఎలాంటి హాని జరగలేదని స్పష్టం చేసింది. పెటా విమర్శలపై వ్యాఖ్యానించడానికి డిస్కవరీ చానల్ వర్గాలు నిరాకరించాయి.