: మా వల్లే అధికారంలోకి వచ్చావ్, మా వల్లే అధికారాన్ని కోల్పోతావ్: కేసీఆర్ కు విద్యార్థుల హెచ్చరిక
తెలంగాణ ప్రభుత్వ వ్యవహారశైలిని నిరసిస్తూ ఉస్మానియా విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. ఉస్మానియాలోని ఆర్ట్స్ కాలేజీ నుంచి ర్యాలీగా బయలు దేరారు. వీరిని ఎన్ సీసీ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకుని బలవంతంగా పోలీసు వాహనాల్లో పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన విద్యార్థులు ముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.
ఏ విద్యార్థుల అండతో అధికారంలోకి వచ్చావో... అదే విద్యార్థుల ఆగ్రహంతో అధికారాన్ని కోల్పోతావని ఓయూ విద్యార్థులు ముఖ్యమంత్రిని హెచ్చరించారు. కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయడం వల్ల విద్యార్థులు దాదాపు 70 వేల ఉద్యోగాలను కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత కుటుంబంలో నలుగురికి రాజకీయ ఉద్యోగాలు ఏర్పాటు చేసుకున్న కేసీఆర్ కు... విద్యార్థుల కుటుంబాల సంగతి అక్కర్లేదా? అంటూ ప్రశ్నించారు. కాంట్రాక్ట్ కార్మికుల ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయరాదని డిమాండ్ చేశారు.