: పుస్తకం ధరపై ఫ్లిప్ కార్ట్ పొరపాటు... నెటిజన్ల జోకుల వెల్లువ!
దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్, ఓ పుస్తకం ధర వెల్లడి సందర్భంగా చేసిన చిన్న పొరపాటు నెటిజన్ల జోకుల వెల్లువకు కారణమైంది. అయితే జరిగిన పొరపాటును క్షణాల్లోనే సర్దుకున్న ఫ్లిప్ కార్ట్, పుస్తకం వాస్తవ ధరను తన వెబ్ సైట్ లో పెట్టింది. ఆంటానియో సియాన్ రాసిన ‘ఫోర్ టోల్డ్’ పుస్తకాన్ని అమ్మకానికి పెట్టిన ఫ్లిప్ కార్ట్, దాని ధరను పొరపాటుగా రూ.33,86,660లుగా పేర్కొంది. అంతేకా తమ సైట్ ద్వారా కొనుగోలు చేస్తే 5 శాతం రిటేబ్ తో రూ.32,17,223 చెల్లిస్తే సరిపోతుందని కూడా వెల్లడించింది.
ఈ పుస్తకాన్ని అమ్మకానికి పెట్టిన నిమిషాల వ్యవధిలోనే పుస్తకం ధరపై జోకులు వెల్లువెత్తాయి. ‘ఆ పుస్తకాన్ని కొనుగోలు చేయాలంటే, బ్యాంకు రుణం కావాల్సిందే. అయితే ప్రపంచ బ్యాంకు సహా ఏ బ్యాంకు కూడా రుణం మంజూరు చేసేందుకు ముందుకు రాలేదు. స్విస్ బ్యాంకులో భారత రాజకీయ వేత్తలు దాచుకున్న నల్లధనంతో అయితే ఈ పుస్తకం కొనొచ్చేమో’ అని ఓ నెటిజన్ భారీ జోకేశాడు. ‘కనీసం ఈఎంఐ ద్వారా కొనుగోలు చేద్దామన్నా, రూ.1,55,993 చెల్లించాలిగా’ అంటూ మరో నెటిజన్ జోకాడు. ఈ జోకులను చూసిన ఫ్లిప్ కార్ట్ జరిగిన పొరపాటును గుర్తించి వెనువెంటనే ఆ పుస్తకం వాస్తవ ధరను వెబ్ సైట్ లోకి పెట్టేసింది.