: టీమిండియా బెర్తు కోసం ఉరకలేస్తున్న కర్ణాటక యువకెరటం
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కోసం మంగళవారం భారత జట్టును ఎంపిక చేయనున్నారు. చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సెలెక్షన్ కమిటీ ముంబయిలో సమావేశం కానుంది. క్లిష్టమైన ఆసీస్ టూర్ కు టీమిండియాకు ఎంపిక నేపథ్యంలో, కర్ణాటక యువకెరటం కేఎల్ రాహుల్ పేరు తెరపైకి వచ్చింది. దులీప్ ట్రోఫీ టోర్నీలో సౌత్ జోన్ కు ప్రాతినిధ్యం వహించిన ఈ 23 ఏళ్ళ రైట్ హ్యాండ్ బ్యాట్స్ మన్ సెంచరీల మోత మోగించాడు. సెంట్రల్ జోన్ తో జరిగిన ఫైనల్లో రెండు ఇన్నింగ్స్ లలోనూ శతకాలు నమోదు చేయడం విశేషం. తొలి ఇన్నింగ్స్ లో 185 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 130 పరుగులు సాధించి జాతీయ జట్టు రేసులో ముందువరుసలోకి వచ్చాడు.
ఈ మ్యాచ్ లో కర్ణాటక ఓటమిపాలైనా, రాహుల్ బ్యాటింగ్ కు మాత్రం ఫుల్ మార్కులు పడ్డాయి. స్వతహాగా ఓపెనర్ అయిన రాహుల్ ను ఆసీస్ టూర్ కు ప్రత్యామ్నాయ ఓపెనర్ గా ఎంపిక చేయాలని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ యోచిస్తున్నట్టు సమాచారం. మురళీ విజయ్, శిఖర్ ధావన్ లకు తోడు రాహుల్ ను కూడా జట్టులోకి తీసుకుంటే జట్టులో ముగ్గురు టెస్టు ఓపెనర్లు ఉంటారు.