: భూసేకరణపై రైతుల అనుమానాలు తొలగిస్తాం: మంత్రి ప్రత్తిపాటి
రాజధానికి భూసేకరణ విషయంలో రైతుల్లో నెలకొన్న అనుమానాలను తొలగిస్తామని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. ఓ మీడియా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడుతూ, రైతులందరినీ ఒప్పిస్తామని, ఎవరికీ నష్టం కలిగేలా వ్యవహరించబోమని తెలిపారు. రైతులే స్వయంగా భూములను ఇచ్చే పరిస్థితి కల్పిస్తామని చెప్పారు. మంత్రివర్గ ఉపసంఘం గ్రామాల్లో పర్యటిస్తుందని, గ్రామాలవారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తామని మంత్రి వివరించారు. ల్యాండ్ పూలింగ్ లోకి వస్తే కలిగే ప్రయోజనాలను ఈ సందర్భంగా రైతులకు వివరిస్తామని తెలిపారు. రైతులు రాజధాని కోసం భూములు ఇస్తే ఉపాధి కోల్పోయే రైతు కూలీలకు స్టయిఫండ్ ఇస్తామని చెప్పారు.