: ఖైదీల చేపల వ్యాపారం... మదురై స్పెషల్

ఇటీవల కాలంలో దేశంలోని పలు జైళ్ళలో సంస్కరణలు ఊపందుకున్నాయి. ఖైదీలతో రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లు నిర్వహిస్తున్నారు. తాజాగా, తమిళనాడులోని మదురై సెంట్రల్ జైలు ఖైదీలు చేపల వ్యాపారం ప్రారంభించారు. గత ఎనిమిది నెలలుగా జైల్లోనే చేపల పెంపకం చేపట్టిన ఖైదీలు, ఇక, వాటిని పట్టుకుని విక్రయించనున్నారు. ఆదివారాలు మాత్రమే ఈ దుకాణం తెరుస్తారు. జైళ్ళశాఖ డీఐజీ వీహెచ్ మహ్మద్ హనీఫా బుధవారం ఈ దుకాణాన్ని ప్రారంభించారు. రిటైర్డ్ ఫిషరీస్ ఇన్ స్పెక్టర్ ఎం.బాలసుబ్రమణియన్ చేపల పెంపకంలో ఐదుగురు ఖైదీలకు, ఓ గార్డుకు శిక్షణ ఇచ్చారు. సిమెంట్ తో రూపొందించిన చిన్నపాటి కుంటలో ఫిబ్రవరిలో 2,500 చేపపిల్లలను వదిలారు. సాధారణంగా చేపల పెంపకం దార్లు చికెన్ వ్యర్థాలు, పారవేసిన ఆహార పదార్థాలను చేపలకు మేతగా ఉపయోగిస్తారని, తాము మాత్రం వరి తౌడు, నూనె చెక్కలను ఆహారంగా అందించామని బాలసుబ్రమణియన్ తెలిపారు. తద్వారా, ఈ చేపలు ఆరోగ్యకరంగా ఎదుగుతాయని చెప్పారు. మున్ముందు మరింతమంది ఖైదీలకు ఈ ఆక్వాకల్చర్ లో శిక్షణ ఇస్తామని జైలు సూపరింటిండెంట్ అరివుందైనంబి తెలిపారు.

More Telugu News