: స్వార్థంతోనే పార్టీని వీడుతున్నారు... 'తీగల'కు ఇవ్వని పదవుందా?: చంద్రబాబు
తెలంగాణలో పార్టీని వీడుతున్న నేతలు కేవలం స్వార్థంతోనే ఆ పని చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. స్వార్థపరులైన నాయకులు పార్టీని వీడుతున్నా... కార్యకర్తలు మాత్రం నిజాయతీగా పార్టీ కోసం పనిచేస్తున్నారని కొనియాడారు. ఇటీవలే టీఆర్ఎస్ లో చేరిన తీగల కృష్ణారెడ్డిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు పార్టీ ఇవ్వని పదవి ఏదైనా ఉందా? అని ప్రశ్నించారు. తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వస్తే... అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కలసిమెలసి ఉండటమే తనకు ముఖ్యమని అన్నారు. 2019 ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. ఈ రోజు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ కార్యకర్తలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా, ఆయన పై వ్యాఖ్యలు చేశారు.