: మోడీ సర్కారు ప్రతిపాదనకు గుజరాత్ సీఎం ససేమిరా!
ఆనంది బెన్ పటేల్, ప్రధాని నరేంద్ర మోడీ ఆశీస్సులతోనే గుజరాత్ ముఖ్యమంత్రి పీఠంపై ఆసీనులయ్యారు. సుదీర్ఘ కాలంగా మోడీ ప్రధాన అనుచరగణంలో ముఖ్యురాలిగా కొనసాగిన ఆనంది బెన్, మోడీ ప్రతిపాదనను తిరస్కరించడమన్న మాటే ఉండదన్నది అత్యధికుల భావన. అయితే, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఆమె మోడీ మాటకు కూడా ఎదురు చెప్పేందుకు ఎంతమాత్రం వెనుకాడరన్నదానికి ఇదే నిదర్శనం.
గుజరాత్ వాణిజ్య రాజధాని అహ్మదాబాద్ మీదుగా సర్ఖెజ్-గాంధీనగర్ ప్రధాన రహదారిని ఏర్పాటు చేయాలన్న మోడీ సర్కారు ప్రతిపాదనను ఆనంది బెన్ ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. సదరు రహదారి అభివృద్ధికి తామే నిధులిస్తామని కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రతిపాదించినా ఆనందిబెన్ పటేల్ పట్టించుకోలేదు. అయితే, ఆనందిబెన్ తిరస్కరణలో న్యాయముందంటున్నారు ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు. జనసమ్మర్ధంగా ఉండే అహ్మదాబాద్ మార్కెట్ మీదుగా ప్రధాన రహదారిని ఎలా ఏర్పాటు చేస్తారని కేంద్రాన్ని ప్రశ్నిస్తూ, ఆనందిబెన్ కు వారు మద్దతు పలికారు.