: 7 లక్షల ఓట్ల మెజార్టీతో ప్రీతం ముండే సరికొత్త రికార్డు!

లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన రాజకీయ నేతల విషయంలో సరికొత్త రికార్డు నమోదైంది. కేంద్ర మాజీ మంత్రి గోపినాథ్ ముండే తనయ ప్రీతం ముండే తాజాగా దాదాపు 7 లక్షల ఓట్ల మెజార్టీ సాధించి, అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన వ్యక్తిగా రికార్డు పుటలకెక్కారు. ఇప్పటిదాకా పశ్చిమ బెంగాల్ లోని అరాంబాగ్ నుంచి 5,92,502 ఓట్ల మెజార్టీతో 2004 ఎన్నికల్లో విజయం సాధించిన సీపీఎం నేత అనిల్ బసు పేరిట ఈ రికార్డు ఉంది. తాజాగా బీద్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికలో ప్రీతం ముండే ఏకంగా 6,96,321 ఓట్ల మెజార్టీలో విజయం సాధించి అనిల్ బసు రికార్డును తుడిచిపెట్టేశారు. గోపినాథ్ ముండే అకాల మరణం నేపథ్యంలో బీద్ పార్లమెంట్ కు తాజాగా ఉప ఎన్నిక జరిగింది. బీజేపీ తరఫున ముండే కూతురు ప్రీతం బరిలో నిలిచారు. శివసేన అభ్యర్థిగా అశోక్ పాటిల్ పోటీకి దిగారు. 32 ఏళ్ల వయసున్న ప్రీతం ముండే అనూహ్యంగా 9,22,416 ఓట్లను కొల్లగొట్టగా, అశోక్ పాటిల్ కేవలం 2,26,095 ఓట్లతో సరిపెట్టున్నారు. ఇదిలా ఉంటే, తెలుగు నేలకు చెందిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, కడప మాజీ ఎంపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ సాధించిన 5 లక్షల పైచిలుకు మెజార్టీ విజయాలు కూడా ప్రీతం మెజార్టీ ముందు చిన్నబోయాయి.

More Telugu News