: నేడే మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు!
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీలకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. రెండు రాష్ట్రాల ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ లు సోమవారం దాకా విస్తృతంగా ప్రచారం చేశాయి. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలే కొనసాగుతుండగా, తాజాగా ఆ ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాయి. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ లో రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ ముందంజలో ఉంది. దాదాపు రెండు రాష్ట్రాల్లోనూ చతుర్ముఖ పోటీనే నెలకొంది.
మహారాష్ట్రలో మొన్నటిదాకా కొనసాగిన పొత్తుల రాజకీయాలకు అన్ని పార్టీలు చరమగీతం పాడాయి. శివసేనతో విడిపోయిన బీజేపీ ఒంటరి పోరు సాగిస్తుండగా, ఎన్సీపీతో తెగదెంపులు చేసుకున్న కాంగ్రెస్ కూడా ఒంటరిగానే బరిలోకి దిగింది. దీంతో ఈ దఫా ఎన్నికలు రసవత్తరంగా మారాయి. హర్యానా ప్రచారంలో భాగంగా ప్రధాన పార్టీల మధ్య మాటల తూటాలు పేలాయి.
మరో గంటలో ప్రారంభం కానున్న పోలింగ్ కు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. సాయంత్రం దాకా నిర్విరామంగా పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపును ఈ నెల 19న చేపట్టనున్నారు. మహారాష్ట్రలో 288 స్థానాలకు, హర్యానాలో 182 సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి.