: మమత పెయింటింగ్ కు రూ. 1.80 కోట్లు: శారదా స్కాంలో కొత్త కోణం

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజకీయంగానే కాదండోయ్, చిత్ర లేఖనంలోనూ కాకలుతీరిన యోధురాలేనట. ఆమె గీసిన ఓ చిత్రరాజం ఏకంగా రూ.1.80 కోట్లు పలికింది మరి. అయితే ఈ చిత్రరాజాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి శారదా చిట్ ఫండ్ అధినేత, ప్రస్తుతం జైలు ఊచలు లెక్కిస్తున్న సుదీప్త సేన్ కావడం తాజాగా కలకలం రేపుతోంది. వేలాది కోట్ల రూపాయల చిట్ ఫండ్ కుంభకోణంలో దర్యాప్తు చేస్తున్న సీబీఐ తాజాగా ఈ విషయాన్ని వెలికి తీసింది. దీంతో ఈ కుంభకోణంలో తృణమూల్ పాత్ర ఉందన్న అంశం మరింత బలపడుతోంది. ఐటీ శాఖ నుంచి ఈ విషయానికి సంబంధించిన వివరాలు సేకరించిన సీబీఐ, దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దీపావళి తర్వాత ఆ పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి ముకుల్ రాయ్ ని విచారించేందుకు చర్యలు చేపడుతోంది. గడచిన సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మమత పెయింటింగ్ కు సుదీప్త సేన్ ఏకంగా రూ.1.80 కోట్లు చెల్లించారని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే తాను మమత పెయింటింగ్ ను కొనుగోలు చేయలేదని నాడు సుదీప్త సేన్ వెల్లడించినా, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన ఆదాయ పన్ను వివరాల్లో ఈ పెయింటింగ్ విషయాన్ని నిర్ధారించింది. తాజాగా ఐటీ శాఖ నుంచి సమగ్ర వివరాలు సేకరించిన సీబీఐ, ఈ కేసులో ఆ పార్టీ నేతల ప్రత్యక్ష ప్రమేయాన్ని ఆధారాలతో నిరూపించేందుకు సమాయత్తమవుతోంది. ఇదే జరిగితే, రాష్ట్రంలో మమత హవా బాగా తగ్గనుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

More Telugu News