: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన పనులు

హుదూద్ తుపాన్ ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో, అక్కడి పరిస్థితులను పునరుద్ధరించడానికి ఏపీ ప్రభుత్వం పనులను ప్రారంభించింది. ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా యుద్ధ ప్రాతిపదికన పనిచేయాలని జిల్లా కలెక్టర్లకు, అన్ని శాఖల అధికారులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని పంచాయతీరాజ్ శాఖకు చెందిన సిబ్బంది మొత్తం సహాయక కార్యక్రమాల్లో తలమునకలై ఉన్నారు. పలు జిల్లాలకు చెందిన ఎస్ఈలు, డీఈలు, ఏఈలు ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల్లో పునరావాస కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. వీరందరూ వరద నీటి మళ్లింపు, రోడ్ల పునరుద్ధరణతో పాటు ఇతర సహాయక కార్యక్రమాలు పూర్తయ్యేంత వరకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉండనున్నారు. మరోవైపు, ఏపీ విద్యుత్ శాఖకు చెందిన ఉన్నతాధికారులు, సిబ్బంది కూడా ఉత్తరాంధ్ర జిల్లాలకు చేరుకున్నారు. వేల సంఖ్యలో పడిపోయిన విద్యుత్ స్తంభాలు, టవర్లు, ట్రాన్స్ ఫార్మర్లను పునరుద్ధరించే పనిలో వీరంతా నిమగ్నమయ్యారు. దీనికితోడు, తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు ఆహార లోటు రాకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. తాగునీరు, ఆహార పొట్లాలను ఇతర ప్రాంతాల నుంచి తుపాను ప్రభావిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు వైజాగ్ లోనే మకాం వేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. రాష్ట్ర మంత్రి వర్గం మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాల్లో మకాం వేసింది.

More Telugu News