: తన అదృశ్యానికి అసలు కారణాలు వెల్లడించని భవ్యశ్రీ
హైదరాబాద్ లో మూడు రోజుల క్రిందట అదృశ్యమైన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ భవ్యశ్రీ కథ సుఖాంతమైంది. పోలీసులు ఆమెను క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే, ఆమె తాను కిడ్నాప్ కు గురవలేదని, కేవలం రిలీఫ్ కోసమే అదృశ్యమయ్యానని తెలిపింది. తన వ్యక్తిగత సమస్యను రచ్చరచ్చచేశారంటూ మీడియాపై కస్సుబుస్సులాడింది. బెజవాడకు చెందిన భవ్యశ్రీ చరిత హైదరాబాదులో పని చేస్తూ మరో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కార్తికేయ చైతన్యను ప్రేమ వివాహం చేసుకుంది.
ఈ నెల 9న క్యాబ్ లో ఆఫీస్ కు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో, ఎంతసేపైనా భార్య రాకపోవడంతో చైతన్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆమె ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేశారు. ముందుగా అన్నవరంలో ఉన్నట్టు గుర్తించారు. అక్కడి లాడ్జీలు, దేవస్థాన వసతి గృహాలకు సమాచారం అందించారు. అక్కడ కూడా భవ్యశ్రీ దొరకకపోవడంతో ఆమె కోసం మరింత పకడ్బందీగా వెదుకులాట సాగించారు.
ఇంతలో పాడేరు గెస్ట్ హౌస్ లో ఆమె ఉన్నట్టు గుర్తించి అక్కడికెళ్లారు. అంతలోనే ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎట్టకేలకు ఆమె వైజాగ్ లో దొరికారు. ఆమెను హైదరాబాదు తీసుకొచ్చిన పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే, ఆమె ఇంటి నుంచి ఎందుకు వెళ్లారు? ఎవరితో వెళ్లారు? వైజాగ్ వెళ్లాలనుకున్నప్పుడు అన్నవరం, పాడేరు గెస్ట్ హౌస్ లకు ఎందుకు వెళ్లారు? వంటి ప్రశ్నలన్నీ సమాధానం దొరకని ప్రశ్నలుగా మిగిలిపోయాయి. రిలీఫ్ కోసం వైజాగ్ వెళ్లానని భవ్యశ్రీయే చెబుతున్నా సందేహాలు అలానే మిగిలిపోయాయి!