: ఢిల్లీ పోలీసులకు న్యాయమూర్తుల 'స్పెషల్ క్లాస్'

ఎన్నో ఏళ్ళుగా పాత పద్ధతుల్లోనే కేసులు దర్యాప్తు చేస్తున్నారంటూ ఢిల్లీ పోలీసులకు న్యాయమూర్తులు 'స్పెషల్ క్లాస్' తీసుకున్నారు. అశాస్త్రీయమైన దర్యాప్తు కారణంగా చోటుచేసుకునే సామాన్య పొరబాట్లే కొందరికి న్యాయాన్ని దూరం చేస్తున్నాయంటూ ఆ న్యాయమూర్తులు భావించడమే ఈ 'క్లాస్' నిర్వహణకు కారణం. ఢిల్లీ హైకోర్టుకు చెందిన జస్టిస్ ప్రదీప్ నంద్రజోగ్, ముక్తా గుప్తా శనివారం నాడు ఢిల్లీ జ్యుడీషియల్ అకాడమీ వేదికగా ఈ వర్క్ షాప్ నిర్వహించారు. సాక్ష్యాలను సమర్పించే అంశంలో పోలీసులు నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడంపై ఈ క్లాస్ లో దృష్టిపెట్టారు. రోజంతా జరిగిన ఈ వర్క్ షాప్ కు ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ సహా పోలీసు గణం అంతా తరలివచ్చింది. జస్టిస్ నంద్రజోగ్ 2013లో ఓ తీర్పు సందర్భంగా పోలీసులకు చురకలంటించారు. ప్రతి 10 సినిమాలకు గాను నాలుగు సినిమాల్లో పోలీసులను బఫూన్లుగానే చూపిస్తున్నారని, అలా ఎందుకు చూపిస్తున్నారో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. మరో తీర్పు వెలువరిస్తూ, ఢిల్లీ పోలీసు అధికారులు యాంత్రికంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. నర్సరీ రైమ్స్ పాడే స్కూలు పిల్లల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఏ కేసు చూసినా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

More Telugu News