: బీజేపీ అభ్యర్థి తరఫున 4 వేల మంది కూతుళ్లు, అల్లుళ్ల ప్రచారం!

మహాభారతంలో దృతరాష్ట్రుడికి వంద మంది కొడుకులు, ఓ కూతురు. ఆధునిక భారతంలో సుభాష్ దేశ్ ముఖ్ కు 2,000 మంది కూతుళ్లు. అంతే సంఖ్యలో అల్లుళ్లు. అంటే...నాటి భారతం కన్నా నేటి భారతమే పెద్దదన్నమాట. దృతరాష్ట్రుడికి వంద మంది కొడుకుల బలముంటే, దేశ్ ముఖ్ కు నాలుగు వేల మంది కూతుళ్లు, అల్లుళ్ల బలముంది. బీజేపీ నేతగా ఉన్న దేశ్ ముఖ్, ఇదివరకు ఎంపీగా ఉన్నారు. తాజాగా ఆయన షోలాపూర్ ఎమ్మెల్యేగా బరిలోకి దిగారు. ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఎందుకంటారేమిటీ, రెండు వేల మంది కుమార్తెలు, రెండు వేల మంది అల్లుళ్లు...ఒక్కసారిగా దేశ్ ముఖ్ తరఫున ప్రచారంలో తీరిక లేకుండా తిరుగుతున్నారు మరి. అసలు విషయం చెప్పకుండా, ఈ ప్రచారం ఏమిటనేగా? సరే, అసలు విషయమేమిటంటే, రెండు వేల మంది కూతుళ్లు, దేశ్ ముఖ్ సొంత కూతుళ్లు కాదులెండి. నిరుపేద కుటుంబాల్లో జన్మించిన యువతులు. ఏటా దేశ్ ముఖ్ జరిపించే సామూహిక వివాహాల్లో తమ పతులతో తాళి కట్టించుకున్నవారు. పెళ్లి తంతు ముగించడమే కాక ఆ దంపతులకు ఆడపిల్ల పుడితే, రూ. 5 వేల చొప్పున బ్యాంకు బాండ్లు అందించారు. దీంతో ఆ రెండు వేల మంది యువతులు, దేశ్ ముఖ్ ను తండ్రిగా పరిగణిస్తే, ఆ మహిళలను పెళ్లి చేసుకున్న యువకులు ఆయనను మామగా కీర్తిస్తున్నారు. ఈ దఫా ఎన్నికల్లో ఆయనను ఎలాగైనా సరే భారీ మెజర్టీతో గెలిపించాలని ఆ 4 వేల మంది తీర్మానించుకున్నారు. అంతే, ప్రచార బరిలోకి దిగిపోయారు. ఇంత మంది ప్రచారంలో పాల్పంచుకుంటే, దేశ్ ముఖ్ గెలవడం నల్లేరు మీద నడకేగా అంటున్నాయి రాజకీయ విశ్లేషణలు!

More Telugu News