: మోడీ విమానంలో డమ్మీ గ్రెనేడ్!
ప్రధాని నరేంద్ర మోడీ కోసం నిలిపిన విమానంలో బయటపడ్డ గ్రెనేడ్ భద్రతా బలగాల్లో కలకలం రేపింది. అయితే మోడీ అమెరికా పర్యటన ముగియడం, సదరు విమానం ముంబై-హైదరాబాద్-జెడ్డాల మధ్య ప్రయాణీకులకు సేవలను ప్రారంభించడంతో భద్రతాధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా మోడీ కోసం ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 747-400 విమానాన్ని స్టాండ్ బై విమానంగా కొనసాగించారు. మోడీ పర్యటన ముగిసిన నేపథ్యంలో ఆ విమానం తిరిగి తన యథాస్థానంలోకి వచ్చింది.
శుక్రవారం రాత్రి ఆ విమానం ప్రయాణికులతో జెడ్డా వెళ్లింది. అక్కడ ల్యాండైన తర్వాత ప్రయాణికులంతా దిగిపోయారు. ఆ తర్వాత విమానంలోని బిజినెస్ క్లాస్ కుర్చీల కింద ఓ గ్రెనేడ్ విమాన సిబ్బంది కంటబడింది. దీంతో వారు హడలిపోయారు. వెనువెంటనే విషయాన్ని భారత్ లోని ఉన్నతాధికారుల దృష్టకి తీసుకెళ్లారు. ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. విచారణ పూర్తయ్యే దాకా విమానాన్ని అక్కడి నుంచి కదలనీయొద్దని విమాన సిబ్బందికి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గత నెల 22, 27 తేదీల్లో ఎన్ఎస్జీ కమెండోలు పలు విమానాశ్రయాల్లో కసరత్తులు చేశారు. ఈ క్రమంలోనే సదరు గ్రెనేడ్ అక్కడికి వచ్చి ఉంటుందని వైమానిక వర్గాలు భావిస్తున్నాయి.