: బహిరంగ సభలో ఆమె చీరను కర్చీఫ్ గా వాడుకున్న ఎమ్మెల్యే!
పల్లెటూళ్ళలో పిల్లలు ఎవరైనా చుట్టాలింట పెళ్లికి వెళ్లి భోజనం చేసిన తరువాత చెయ్యి కడుక్కుని, ఆ చేతుల్ని ఎవరో ఒకరి దుస్తులకు తుడిచేసుకుంటూ ఉండడాన్ని మనం చూస్తూనే వుంటాం. అలాంటి సంఘటనే మధ్యప్రదేశ్ లోని బహిరంగ సభలో చోటుచేసుకుంది. అయితే, ఇక్కడ అలాంటి పని చేసింది మాత్రం ఓ ప్రజాప్రతినిధి కావడం విశేషం! ఆ రాష్ట్రంలోని సియోనిలో రైతులకు పంట బీమా పథకం ప్రారంభించే ముందు స్థానిక ఎమ్మెల్యే దినేష్ రాయ్ దీపం వెలిగించారు. ఈ సందర్భంలో ఆయన చేతికి నూనె అంటుకుంది.
టిప్ టాప్ గా తయారైన దినేష్ రాయ్ తన చేతిని తుడుచుకునేందుకు మాజీ ఎంపీ నీతా పటేరియా చీరను ఎంచుకున్నారు. అంతే, ఆమె దగ్గరకెళ్ళి చీరతో చేయి తుడుచుకున్నారు. దీనిని గమనించిన ఆమె పట్టించుకోకుండా మిన్నకుండిపోయారు. కానీ, ఆ దృశ్యం కెమేరా కంటికి చిక్కింది. అంతే... అక్కడ సెన్సేషనల్ ఇష్యూ అయిపోయింది.
టీవీ ఛానెళ్లలో ఈ దృశ్యాలు పదే పదే న్యూస్ ప్రసారం కావడంతో గతుక్కుమన్న ఎమ్మెల్యే, మాజీ ఎంపీ వద్దకు వెళ్లి క్షమాపణలు కోరారు. తరువాత మీడియా సమావేశం పెట్టి, అది సరదాగా చేసిన పని మాత్రమేనని, దానిని వివాదం చేయవద్దని సూచించారు. మాజీ ఎంపీ మాత్రం ఆయన చేసిన పనిపై చర్య తీసుకోవాలో వద్దో బీజేపీ వర్గాలకే వదిలేస్తున్నానని అన్నారు.