: డబ్బు ఎంతంటే అంత విడుదల చేస్తా, రోగులకు సరైన సేవలు అందిస్తారా?: డాక్టర్లకు కామినేని 'క్లాస్'

ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తన శాఖ అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. సరిగ్గా పని చేయని తన శాఖ అధికారులను ఆయన ఏమాత్రం ఉపేక్షించడం లేదు. తాజాగా నిన్న విజయవాడలో ఆయన వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు 'క్లాస్' తీసుకున్నారు. ''నిధులు ఎంత కావాలంటే అంత విడుదల చేస్తా. విధులు సక్రమంగా నిర్వహిస్తారా? రోగులకు సరైన సేవలు అందజేస్తారా, గుండెలపై చేయి వేసుకుని చెప్పండి?" అంటూ కామినేని శ్రీనివాస్‌ జిల్లా అధికారులను ప్రశ్నించారు. దాంతో, ఒక్కసారిగా వారు షాక్ తిన్నారు. సమాధానం చెప్పలేక తడబడ్డారు. ప్రభుత్వం ఎంత డబ్బు విడుదల చేస్తున్నప్పటికీ, ప్రభుత్వ ఆసుపత్రులలో పరిస్థితులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారయ్యానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, గవర్నమెంట్ డాక్టర్ల తీరు వల్లే ప్రభుత్వాసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు అందుతాయనే నమ్మకాన్ని సామాన్య ప్రజలు కోల్పోయారన్నారు. విజయవాడలోని ప్రభుత్వాసుపత్రిలో బుధవారం జిల్లా ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఆయన నిర్వహించారు. రోగులనుంచి ఎటువంటి ఫిర్యాదు రానివ్వకుండా... మెరుగైన వైద్య సేవలు అందజేసే డాక్టర్లను తప్పకుండా గుర్తించి పదోన్నతులు కల్పిస్తామన్నారు. అదే విధంగా విధులు సక్రమంగా నిర్వహించకుంటే చర్యలు కూడా కఠినంగా ఉంటాయన్నారు. వైద్యులు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ కచ్చితంగా ఆసుపత్రిలో ఉండాల్సిందేనని ఆయన ఆదేశించారు. ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా తమపైనా, అధికారులుగా వారిపైనా ఉందన్నారు. గుంటూరు, విజయవాడలను హైదరాబాద్‌కు మించిన మెడికల్‌ హబ్‌గా తయారు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. దానిలో భాగంగానే, త్వరలో విజయవాడలో సూపర్‌ స్పెషాలిటీ హాస్పటల్ నిర్మాణం చేపట్టబోతున్నట్టు కామినేని తెలిపారు.

More Telugu News