: నెట్టింట్లో ఎన్ని వెబ్ సైట్లు ఉన్నాయో తెలుసా..?

ఇంటర్నెట్ లేని సమాజాన్ని ఊహించలేం. ప్రజలతో అంతగా పెనవేసుకుపోయిందీ వ్యవస్థ. ప్రపంచం ఏమూలన ఉన్నా చిటికెలో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ఇంటర్నెట్ ద్వారానే సాధ్యమైంది. అందుకెన్నో వెబ్ సైట్లు ఉన్నాయి. ప్రభుత్వాలు, సంస్థలు, పరిశ్రమలు, కళలు, సినిమా రంగం, క్రీడారంగం, స్టాక్ మార్కెట్లు... ఇలా ఒకటేమిటి, ప్రతిదానికీ వెబ్ సైట్ ఉండడం పరిపాటిగా మారింది. కొందరు వ్యక్తుల పేరిట కూడా ఈ సైట్లు ఏర్పాటవడం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంప్యూటర్లను ఓ నెట్ వర్క్ ద్వారా అనుసంధానం చేయగా ఏర్పడే వ్యవస్థను ఇంటర్నెట్ అనుకుంటే, ఆ అనుసంధాన నెట్ వర్క్ ను వరల్డ్ వైడ్ వెబ్ (www) గా పేర్కొనవచ్చు. 1989 మార్చి 12న ప్రఖ్యాత బ్రిటీష్ శాస్త్రవేత్త టిమ్ బెర్నర్స్ లీ ఈ వరల్డ్ వైడ్ వెబ్ ను పరిచయం చేశాడు. బెర్నర్స్ లీ ప్రస్తుతం స్విట్జర్లాండ్ లోని సెర్న్ ప్రయోగశాలలో పరిశోధకుడిగా ఉన్నారు. అంతకుముందు 1960లో అమెరికా తన రక్షణ రంగం అవసరాల కోసం రూపొందించుకున్న నెట్ వ్యవస్థ తదనంతరకాలంలో ఇంటర్నెట్ గా రూపాంతరం చెందింది. వరల్డ్ వైడ్ వెబ్ వచ్చిన తర్వాత వెబ్ సైట్లు ఏర్పాటయ్యాయి. అలా మొదలైన వెబ్ సైట్ల సంఖ్య నేటికి 100 కోట్లు దాటిందని 'ఆన్ లైన్ ట్రాకర్ ఇంటర్నెట్ లైవ్ స్టాట్స్' తెలిపింది. వీటి సంఖ్య ఇంకా పెరుగుతుందని ఆ సంస్థ పేర్కొంది.

More Telugu News