: హైదరాబాదు ట్రాఫిక్ పోలీసులకు 'బాడీ కెమెరాలు'!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును సింగపూర్ వ్యవస్థలు విశేషంగా ఆకర్షించినట్టున్నాయి. ఆ తరహాలో, ఇప్పటికే హైదరాబాదు పోలీసులకు ఆధునిక వాహన సంపత్తి సమకూర్చిన ఆయన, తాజాగా, ట్రాఫిక్ పోలీసింగ్ పై దృష్టి పెట్టారు. నగరంలోని ట్రాఫిక్ పోలీసులకు 'బాడీ కెమెరాలు' అందించాలని భావిస్తున్నారు. సీఎం సూచనల మేరకు సింగపూర్ పోలీస్ వ్యవస్థను అధ్యయనం చేసిన రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ అండ్ కో ఈ సరికొత్త కెమెరాలను వెంటనే ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. తద్వారా, కేంద్ర కంట్రోల్ రూంలో ఉన్న సిబ్బంది కూడా విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ కు, పౌరులకు మధ్య జరిగే సంభాషణలను గమనించవచ్చు.
ఈ మేరకు సైఫాబాద్ ట్రాఫిక్ సబ్ ఇన్ స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డికి ప్రయోగాత్మకంగా ఓ 'బాడీ కెమెరా' అమర్చి విధులకు పంపారు. నిబంధనలు ఉల్లంఘించిన చాలామంది వాహనదారులు, తన వద్ద కెమెరా ఉందని చెప్పేసరికి, పలుకుబడి ఉన్న నేతల పేర్లు చెప్పడం ఆపేశారని ఆ ఎస్సై చెప్పారు. వారు చెప్పే పేర్లన్నీ ఈ కెమెరాలో రికార్డవుతాయని చెప్పడంతో వెంటనే ఫైన్ కట్టేశారని తెలిపారు.