: మెదక్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన కేసీఆర్
మెదక్ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యకర్తల కృషి వల్లే మెదక్ లో టీఆర్ఎస్ గెలిచిందన్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ గెలుపుతో తమ బాధ్యత మరింత పెరిగిందన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ సాగించిన గోబెల్స్ ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టారన్నారు. టీడీపీతో కలిసినందుకు బీజేపీకి గట్టి దెబ్బే తగిలిందన్నారు.
ఇప్పటికైనా ప్రతిపక్షాలు నిర్మాణాత్మక పాత్ర పోషించాలని కేసీఆర్ సూచించారు. ఇచ్చిన హామీలన్నీ వందశాతం నెరవేరుస్తామని ఉద్ఘాటించారు. పటిష్టమైన అభివృద్ధి దిశగా అడుగులు వేయాలన్నారు. కేసీఆర్ మార్కు, టీఆర్ఎస్ మార్కు పాలన ఇంకా మొదలుకాలేదన్నారు. అర్హులకే ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు వర్తింపజేసేలా చర్యలు తీసుకుంటామని, దసరా నుంచి దీపావళి మధ్య చాలా ఉత్తర్వులు ఇవ్వనున్నామని పేర్కొన్నారు.