: 'అపోలో' ప్రతాపరెడ్డి పోలీస్ అవ్వాలనుకుని డాక్టరయ్యారట!

దేశవ్యాప్తంగా అపోలో హాస్పిటల్స్ కు ఉన్న పేరు ప్రఖ్యాతులు తెలిసిందే. ఆ గుర్తింపు వెనుక ఉన్న శక్తి ప్రతాప్ సి రెడ్డి. వైద్యరంగంలో లబ్దప్రతిష్ఠుడాయన. వాస్తవానికి ఆయన పోలీస్ అధికారి కావాలనుకున్నారట. కానీ, తన తండ్రి వ్యాపార, వాణిజ్య రంగాల్లోకి వెళ్లమన్నారని ప్రతాపరెడ్డి తెలిపారు. దీంతో, రాయలసీమ రీజియన్ వైద్య ప్రవేశ పరీక్షలో ప్రథమర్యాంకు సాధించి, మద్రాస్ స్టాన్లీ మెడికల్ కాలేజీలో వైద్యవిద్య అభ్యసించానని చెప్పారు. అనంతరం విదేశాల్లో ఉన్నతవిద్య పూర్తి చేసి, పలు ప్రతిష్ఠాత్మక సంస్థల్లో పనిచేశానని పేర్కొన్నారు. కొన్ని సంఘటనల నేపథ్యంలో అందరికీ అందుబాటులో ఉండేవిధంగా ఓ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నెలకొల్పానని తెలిపారు. తన ఆసుపత్రికి తెలుగులోగానీ, సంస్కృతంలోగానీ పేరు పెడదామనుకున్నానని, అయితే, చివరికి గ్రీకు పురాణాల్లో వైద్యానికి అధిదేవతగా భావించే 'అపోలో' పేరు ఎంచుకున్నామని వివరించారు. ఓ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలు పంచుకున్నారు. ప్రతాపరెడ్డి నటుడు రామ్ చరణ్ అర్థాంగి ఉపాసన తాతగారన్న సంగతి తెలిసిందే.

More Telugu News