: సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో రామలింగరాజుకు ఊరట
సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో రామలింగరాజుకు కాస్త ఊరట లభించింది. గతంలో రామలింగరాజుతో పాటు మరో నలుగురు మీద సెబీ రూ. 1,849 కోట్ల రూపాయలను జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని 12 శాతం వడ్డీతో కలుపుకుని (అంటే మొత్తం రూ. 3,000 కోట్లు) 45 రోజుల్లో చెల్లించాలని సెబీ ఆదేశించింది. సెబీ ఆదేశాలను సవాలు చేస్తూ రామలింగరాజు తదితరులు సెక్యూరిటీస్ అప్పీలేట్ ట్రైబ్యునల్ (శాట్)ను ఆశ్రయించారు.
ఈ కేసు విచారణను సోమవారం చేపట్టిన శాట్ సెబీ జరిమానాపై స్టే ఇచ్చింది. ఇంత భారీ జరిమానాలకు ఎందుకు ఆదేశాలు ఇచ్చారనే విషయంపై నవంబర్ 7లోగా వివరణ ఇవ్వాలని శాట్ సెబీని ఆదేశించింది. అయితే, స్టాక్ మార్కెట్ల నుంచి రామలింగరాజు తదితరులను 14 సంవత్సరాల పాటు నిషేధిస్తూ సెబీ తీసుకున్న నిర్ణయాన్ని శాట్ సమర్థించింది. దీనికి సంబంధించి తదుపరి విచారణను శాట్ డిసెంబర్ కు వాయిదా వేసింది.