: కట్నం కోసం మహిళను మూడేళ్ళు బాత్రూంలో బంధించారు!
వరకట్న సమస్య ఈనాటిది కాదు. ఏళ్ళుగా అది మన సమాజాన్ని పట్టిపీడిస్తూనే ఉంది. ఎందరో అమ్మాయిలు ఈ కట్నపిశాచి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. నేటికీ కట్నం విషయంలో అత్తవారింట ఎన్నో అవమానాలు, మరెన్నో అకృత్యాలు. ఈ క్రమంలో బీహార్ లోని దర్భంగ పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. కట్నం మరింత తీసుకురాలేదంటూ, ఓ యువతిని మూడేళ్ళుగా బాత్రూంలో బంధించారు ఆమె భర్త, అత్తమామలు. చివరకు ఆమె తండ్రి తీవ్రంగా ప్రయత్నించిన మీదట విముక్తి కలిగింది.
బాధితురాలికి 2010లో ప్రభాత్ కుమార్ తో వివాహం అయింది. అప్పటి నుంచి అదనపు కట్నం తెమ్మంటూ అత్తింటివారు వేధించసాగారు. కనీసం తల్లిదండ్రులను చూసేందుకు కూడా ఆమెను అనుమతించలేదు ఆ కిరాతకులు. ఇరుకైన బాత్రూంలో బంధించి, ఎప్పుడోగానీ ఆహారం పెట్టేవాళ్ళుకాదు. ఆఖరికి, ఆమె బిడ్డను సైతం కలుసుకోకుండా చేశారు. ఎట్టకేలకు పోలీసుల సాయంతో ఆమె బయటి ప్రపంచాన్ని చూడగలిగింది.
అత్యంత విచారకరమైన విషయం ఏమిటంటే... బాహ్య ప్రపంచంలోకి వచ్చిన పిమ్మట తన కుమార్తెను చూడాలని కోరుకున్న ఆమెకు షాక్ తగిలింది. ఆ చిన్నారి తన తల్లిని గుర్తుపట్టలేకపోయింది. దీంతో, బాధితురాలు దుఃఖంలో మునిగిపోయింది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.