: కొత్త కార్యవర్గ కూర్పుపై అమిత్ షా కసరత్తు
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన అమిత్ షా తన కొత్త కార్యవర్గంపై కసరత్తును ప్రారంభించారు. గత నెలలోనే జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన అమిత్ షా నియామకానికి గత వారం పార్టీ జాతీయ కౌన్సిల్ కూడా ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. జాతీయ కౌన్సిల్ ఆమోదం లభించిన మరుక్షణమే కొత్త కార్యవర్గాన్ని ప్రకటించే అవకాశాలున్నాయని ప్రచారం జరిగినప్పటికీ, అమిత్ షా ఆ దిశగా ప్రకటన చేయలేదు. తాజాగా తన కొత్త కార్యవర్గం కూర్పుపై అమిత్ షా కసరత్తును దాదాపు పూర్తి చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
అందరూ భావిస్తున్నట్లుగానే ఇటీవలే ఆరెస్సెస్ నుంచి బీజేపీలో చేరిన రామ్ మాధవ్ కు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి దక్కనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న పీయూష్ గోయల్, పార్టీ కోశాధికారిగానూ వ్యవహరిస్తున్నారు. ఒకరికి ఒకే పదవి నినాదం నేపథ్యంలో పీయూష్ గోయల్ ను కోశాధికారి పదవి నుంచి తప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సరైన వ్యక్తి లభించని పక్షంలోనే పీయూష్ గోయల్ ను కోశాధికారిగా కొనసాగించనున్నట్లు సమాచారం. మరోవైపు దివంగత ప్రమోద్ మహాజన్ కుమార్తె పూనమ్ మహాజన్ కు పార్టీ కొత్త కార్యవర్గంలో చోటు లభించడం ఖాయంగానే కనిపిస్తోంది.