: సచిన్ పై కట్జూ వ్యాఖ్యల పట్ల మండిపడుతున్న శివసేన
భారత క్రికెట్ ఐకాన్ సచిన్ టెండూల్కర్ పై వ్యాఖ్యలు చేసిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ మార్కండేయ్ కట్జూపై శివసేన మండిపడుతోంది. టెండూల్కర్ కు భారతరత్న ఇవ్వడం, ఆయనను ఎంపీగా నామినేట్ చేయడం దేశానికే అగౌరవం అని కట్జూ పేర్కొనడాన్ని సేన తప్పుబట్టింది. తమను ఎంపీలుగా నామినేట్ చేయాలని సచిన్, రేఖ ప్రభుత్వాన్ని కోరలేదని, రాష్ట్రపతే క్రీడలు, కళలను గౌరవించే క్రమంలో వారిని రాజ్యసభకు నామినేట్ చేశారని తన 'సామ్నా' పత్రిక సంపాదకీయంలో పేర్కొంది.
"జస్టిస్ కట్జూ న్యాయమూర్తిగా రిటైరైనా, ముఖ్యమైన బాధ్యతలను చేజిక్కించుకున్నారు. మరి, తన పదవీకాలంలో ప్రెస్ కౌన్సిల్ ఏం ఒరగబెట్టిందో ఆయన చెప్పలేరు" అంటూ సేన ఎత్తిపొడిచింది. ఇక, భారతరత్న విషయానికొస్తే... సచిన్, ధ్యాన్ చంద్ ఇద్దరికీ ఒకేసారి భారతరత్న ప్రకటించాల్సిందని, అయితే, యూపీఏ సర్కారు ఆ విధంగా చేయలేదని తెలిపింది. అది యూపీఏ తప్పిదమని సేన వివరించింది.
అంతకుముందు, సచిన్, రేఖ రాజ్యసభకు సరిగా హాజరుకాకపోవడంపై స్పందిస్తూ కట్జూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "టెండూల్కర్, రేఖ రాజ్యసభలో ఏంచేశారు? అందుకు జవాబు శూన్యమే. మరి వారినెందుకు ఎంపీలుగా నామినేట్ చేసినట్టు?" అని ప్రశ్నించారు.