: మోడీ వేషధారణపై ట్విట్టర్లో జోకులు

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఏ రాష్ట్రం వెళితే అక్కడి స్థానికతను ప్రతిబింబించేలా దుస్తులు ధరిస్తారు. తాజాగా, జమ్మూకాశ్మీర్ పర్యటన సందర్భంగా అదే సంప్రదాయాన్ని పాటించారు. అయితే, ఈసారి ఆయన ఆహార్యంపై ట్విట్టర్లో పలు జోకులు పేలాయి. నేడు ఆయన లేహ్-శ్రీనగర్ విద్యుత్ ట్రాన్స్ మిషన్ లైన్ తోపాటు నిమ్మో-బాజ్గో జలవిద్యుత్ కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన కాశ్మీరీ దుస్తుల్లో కొత్తగా కనిపించారు. ఓ విధంగా చెప్పుకోవాలంటే కాస్త నవ్వుపుట్టించే విధంగానే ఉన్నారు. ఈ సభకు సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా హాజరయ్యారు. దీనిపై కొందరు ట్విట్టర్ యూజర్లు కామెడీ టచ్ తో కామెంట్లు చేశారు. చూడ్డానికి మోడీ వయసు మళ్ళిన జపాన్ గెయిషా (రాజవేశ్య)లా ఉన్నాడని, అసలా డ్రెస్సు చూస్తుంటే మాటలు రావడం లేదని కొందరు ట్వీట్లు చేశారు. ఇక, సభలో మోడీ, ఒమర్ పక్కపక్కనే కూర్చోవడం పట్ల వ్యాఖ్యానిస్తూ... ఇద్దరిలో ఎవరు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ గెలుస్తారోనంటూ ఓ ట్వీట్ వదిలారు. అకేషన్ మాట పక్కనబెడితే మోడీ ఏదో ఫ్యాషన్ వీక్ కు వచ్చినట్టుందని ఓ మహిళా ట్వీటర్ వ్యాఖ్యానించారు. మరో మహిళ అయితే, తాను లేహ్ ప్రాంతానికి వెళితే ఇలాంటి దుస్తులే ధరిస్తానని పేర్కొంది. అన్నింటికంటే హాస్య స్ఫోరకంగా ఉన్న ట్వీట్ ఏంటంటే... మొల భాగానికి గోచీలు మాత్రమే పెట్టుకున్న అండమాన్ ప్రాంత అటవిక తెగ ఫొటో పోస్టు చేసి దానికింద ఇలా రాశారు... "మోడీ ఎక్కడికి వెళితే అక్కడి డ్రెస్సులేసుకుంటారు. అండమాన్ ను కూడా ఆయన ఏ సమయంలోనైనా సందర్శించవచ్చు" అని, అప్పుడు ఎలాంటి డ్రెస్సు వేసుకుంటారో అన్న అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు.

More Telugu News