: భారత అథ్లెట్ల గదుల్లో సిరంజిలు... మనవాళ్ళు డోపీలా?
ఇటీవలే ముగిసిన కామన్వెల్త్ క్రీడల్లో మనవాళ్ళు మెరుగైన ప్రదర్శన కనబరిచారని మురిసిపోతున్న క్రీడాధికారులకు చేదువార్త! గ్లాస్గోలోని కామన్వెల్త్ విలేజ్ లో మనవాళ్ళు బసచేసిన గదుల్లో కొన్ని సిరంజిలు, సూదులు లభ్యం అయ్యాయట. దీంతో, మన క్రీడాకారుల విషయంలో డోపింగ్ అనుమానాలు తలెత్తాయి. సిబ్బంది గదులను శుభ్రం చేస్తుండగా ఇవి దొరికాయి. సదరు పారిశుద్ధ్య సిబ్బందికి సిరంజిలు తదితర సామగ్రి విషయంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారట కామన్వెల్త్ నిర్వాహకులు. ఇలాంటి వస్తువులు దొరికితే వెంటనే అధికారులకు తెలపాలని వారికి నిర్దేశించారు.
కాగా, మూడు పర్యాయాలు భారత అథ్లెట్ల గదుల్లో ఈ సిరంజిలు దొరికాయని తెలుస్తోంది. ఈ విషయమై కామన్వెల్త్ నిర్వాహకులు భారత జట్టు మేనేజ్ మెంట్ ను మందలించారట. దీనిపై భారత బృందం చెఫ్ డి మిషన్ రాజ్ సింగ్ మాట్లాడుతూ, మన అథ్లెట్లు డోపీలు కాదని స్పష్టం చేశారు. వారు మల్టీ విటమిన్ ఇంజెక్షన్లను తీసుకోడానికే సిరంజిలు వినియోగించారని వివరించారు.