: పాకిస్థాన్ జాతీయులకూ 'ఆధార్' కార్డులిచ్చారు!
ఇటీవలే ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టు నేత హేమ్వతిని అరెస్టు చేశారు. ఆయన అరెస్టు అనంతరం రాయ్ పూర్ ప్రాంతంలో తనిఖీలు, సోదాలు ముమ్మరం చేశారు పోలీసులు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ముఖ్యంగా పాకిస్థాన్ జాతీయులు వారి వీసా కాలపరిమితి ముగిసినా ఇంకా అక్కడే ఉన్నట్టు తెలుసుకున్నారు. అంతేగాకుండా, వారు రేషన్ కార్డులతో పాటు ఆధార్ కార్డులూ పొందారన్న విషయం విస్మయం కలిగిస్తోంది.
ఇమ్మిగ్రేషన్ శాఖ రికార్డుల ప్రకారం రాయ్ పూర్లో 1632 మంది పాకిస్థానీలు ఉంటున్నారు. రికార్డుల్లో పేర్కొన్న చిరునామాల్లో విచారిస్తే వారిలో చాలా మంది ఆచూకీ తెలియరాలేదు. కాగా, పాకిస్థానీలకు కూడా ఆధార్ కార్డులు జారీచేశారన్న సమాచారం తెలియగానే తాము షాక్ కు గురయ్యామని రాయ్ పూర్ ఎస్పీ ఓపీ పాల్ తెలిపారు.
దీని వెనుక ఓ రాకెట్ ఉందని భావిస్తున్నారు. ఆ ముఠాకు మంత్రులు, అధికారులతో సత్సబంధాలు ఉన్నాయని, వారే పాకిస్థానీలకు నకిలీ పత్రాల సాయంతో కార్డులిప్పించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.