: ప్రియమైన మోడీ గారికి,...: కేసీఆర్ లేఖ సారాంశం
హైదరాబాదులో గవర్నర్ గిరీని ఎట్టిపరిస్థితుల్లోను అంగీకరించబోమని టీఎస్ ప్రభుత్వం బల్లగుద్ది మరీ చెబుతోంది. ఈ వ్యవహారానికి సంబంధించి కేంద్ర హోంశాఖ నుంచి ఇప్పటికే రెండు లేఖలు వచ్చినప్పటికీ... హైదరాబాదుపై తమ పట్టు సడలకుండా కాపాడుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. గవర్నర్ గిరీకి తాము వ్యతిరేకమంటూ... టీఎస్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. అలాగే, ప్రధాని మోడీకి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ మరో లేఖ సంధించారు. కేసీఆర్ లేఖలోని వివరాలు ఇవే...
ప్రియమైన మోడీ గారికి,
ఎంతో బాధతో ఈ లేఖ రాస్తున్నా. 08.08.2014 నాడు కేంద్ర హోంశాఖ నుంచి మాకు అందిన ఉత్తర్వులు కలచివేశాయి. మన సమాఖ్య వ్యవస్థకు సంబంధించిన రాజ్యాంగపరమైన ఓ సున్నిత అంశం ఇది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అనుచితమైన నిబంధనలను పాటించాలని లేఖలో పేర్కొన్నారు. హైదరాబాదులో ఉండే డీసీపీలు, ఏసీపీలు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ల బదిలీల విషయంలో గవర్నర్ దే తుది నిర్ణయమని ఉత్తర్వుల్లో తెలిపారు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర కేబినెట్ సలహాల మేరకు గవర్నర్ విధులు నిర్వహించాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం, 2014లోని సెక్షన్ 8(3) కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. కేబినెట్ సూచనలను గవర్నర్ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని... అయితే, తన విచక్షణను ఉపయోగించి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని... పునర్వ్యవస్థీకరణ బిల్లులో ఉంది. ప్రస్తుత ఉత్తర్వులతో ఈ నిబంధనలను ఉల్లంఘించినట్టు అవుతుంది.
తాజా ఉత్తర్వుల ప్రకారం, కేబినెట్ నుంచి సలహాలు, సమాచారం తీసుకోకుండానే... నేరుగా పరిపాలనలో జోక్యం చేసుకునే అవకాశం గవర్నర్ కు ఉంటుంది. ఇది మన దేశ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. కేంద్ర హోంశాఖ నుంచి మాకు అందిన లేఖ ప్రతిని కూడా జతపరుస్తున్నాను. మీ ఆమోదం లేకుండానే కేంద్ర హోంశాఖ మాకు లేఖ పంపి ఉంటుందని నేను భావిస్తున్నారు. ఈ అంశాన్ని కూలంకుషంగా పరిశీలించి... మన సమాఖ్య మర్యాదను, ప్రజాస్వామ్య సంప్రదాయాలను కాపాడతారని... తక్షణమే ఈ ఉత్తర్వులను రద్దు చేయాల్సిందిగా ఆదేశిస్తారని భావిస్తున్నాను.
మీ
కె.చంద్రశేఖర్ రావు,
తెలంగాణ ముఖ్యమంత్రి.